: అటువంటి ముఖ్యమంత్రిపైనా జగన్ విమర్శలు చేసేది?: కాల్వ శ్రీనివాసులు
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న కార్యక్రమాలను ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అనుక్షణం పనిచేస్తూ, ఎన్నో ప్రయత్నాలు జరిపితే ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని అన్నారు. త్వరలోనే 2,500 కోట్ల రూపాయల నిధులు అందే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా జగన్ అడ్డుకునే ప్రయత్నాలు జరుపుతున్నారని కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సోమవారాన్ని పోల'వారం'గా ప్రకటించి సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారని, పనులను పరుగులు పెట్టిస్తున్నారని ఆయన అన్నారు. అటువంటి సీఎంపై 'పోలవరం ప్రాజక్టుపై ఆయనకు శ్రద్ధ లేద'ని జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. పోలవరం కుడికాలువ నిర్మాణాన్ని చంద్రబాబు ఎంతవేగంగా చేశారో ప్రజలందరికీ తెలుసని, అమరావతిని కూడా పూర్తి చేస్తారని అన్నారు.