: వ్యక్తిగతంగా ఎవరు రాణించార్నది కాదు...జట్టుగా రాణించామా? లేదా? అన్నదే ప్రధానం: కోహ్లీ
వ్యక్తిగత ప్రదర్శనపై తనకు పెద్దగా పట్టింపు లేదని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. జట్టుగా రాణించి విజయం సాధిస్తే అదే చాలని అన్నాడు. అజింక్యా రహానే, మురళీ విజయ్ లు విఫలమవుతున్నారన్న విమర్శలపై మండిపడ్డాడు. జట్టులో అందరూ రాణిస్తున్నారని, ఒకవేళ ఎవరైనా విఫలమైతే ఆ బాధ్యతను మరొక ఆటగాడు తీసుకుంటున్నాడని తెలిపాడు. న్యూజిలాండ్ తో సిరీస్ లో తాను రాణించలేకపోతే రహానే ఆకట్టుకున్నాడని అన్నాడు. అందుకని వ్యక్తిగత ప్రదర్శనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని, జట్టుగా రాణించడం ముఖ్యమని, విజయం సాధించడం ప్రధానమని తెలిపాడు. వర్ధమాన ఆటగాడు జయంత్ యాదవ్ ఆల్ రౌండర్ గా ఎదుగుతాడని కితాబిచ్చాడు. తన నుంచి ఎలాంటి ప్రదర్శనను జట్టు ఆశిస్తుందో అతనికి తెలుసని, తెలివైన బంతులేస్తాడని అన్నాడు. మురళీ విజయ్, కేఎల్ రాహుల్ అద్భుతమైన ఓపెనర్లని తెలిపాడు. లోయర్ ఆర్డర్ అద్భుతంగా ఆడుతోందని కితాబునిచ్చాడు. మొత్తానికి జట్టు ప్రదర్శనపై కోహ్లీ ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది.