: కొత్త దారులు చూసుకున్న బాలీవుడ్ ప్రేమికులు!
'ఆషికీ 2' విడుదలైన నాటి నుంచి ఆ చిత్రంలో జంటగా నటించిన ఆదిత్యారాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ ప్రేమలో పడ్డారని, వివాహం కూడా చేసుకుంటారని పుకార్లు షికార్లు చేశాయి. వాటిని వీరిద్దర్లో ఎవరూ ఖండించలేదు. అయితే, ఆ తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రాతో సినిమా చేస్తూ శ్రధ్ధా ప్రేమలో పడిందని, దీంతో అలియా భట్, శ్రద్ధా కపూర్ మధ్య వార్ జరుగుతోందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి. తరువాత 'రాక్ ఆన్ 2' షూటింగ్ సందర్భంగా రచయిత, నటుడు, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ ఆమెతో ప్రేమలో పడ్డాడని, దీంతో భార్య అధునాతో విడిపోయాడని, కొత్తగా తీసుకున్న ఇంట్లో కాపురం కూడా పెట్టాడని బాలీవుడ్ లో చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో తానేం తక్కువ తిన్నానని అనుకున్నాడో ఏమో కానీ ఆదిత్యారాయ్ కపూర్ అంతర్జాతీయ సెలబ్రెటీ హెయిర్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ మరియానా ముకుచ్యాన్ తో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ ఈ మధ్య కాలంలో వరుసగా సెలబ్రిటీ పార్టీల్లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా వీరు బాలీవుడ్ స్టార్లు నిర్వహించే పార్టీల్లో కలిసి డ్యాన్స్ చేస్తూ తమ ప్రేమను చాటుకుంటున్నారని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఇద్దరూ ఇలా విడిపోయి ఎవరి దారి వారు చూసుకుంటున్నారన్న మాట.