: ఆంధ్రప్రదేశ్‌కు ‘ప్రత్యేక హోదా’ సంగతేంటి?: లోక్‌సభలో ప్రశ్నించిన వైసీపీ ఎంపీలు
వాయిదా అనంతరం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన లోక్‌సభలో విపక్షాల ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ ఎంపీలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం ఏమైపోయిందని వైవీ సుబ్బారెడ్డి అడిగారు. ఈ అంశంపై ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని, ఏపీ విభజన చట్టంలో ఉన్న అంశాలను ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు. ఏపీ ప్రజలు పడుతున్న కష్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని చెప్పారు. వైసీపీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ కొత్తగా వచ్చిందేమీ కాదని, రెండున్నర ఏళ్లుగా కాలయాపన చేస్తున్నారని ఆమె అన్నారు. హోదా కోసం నిరసనలు తెలుపుతున్నా పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఉద్ఘాటించారు. అనంతరం లోక్ సభను ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. మరోవైపు, పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుండడంతో రాజ్యసభను ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ హమీద్ అన్సారీ ప్రకటించారు.