: అమ్మ 'వేద నిలయం' ఎవరికి చెందుతుంది?


చెన్నై, పోయిస్ గార్డెన్ లోని వేద నిలయం... మొన్నమొన్నటి వరకూ తమిళనాడులో రెండున్నర దశాబ్దాల రాజకీయాన్ని శాసించిన ప్రాంతం. దాదాపు రెండు దశాబ్దాల పాటు అన్నాడీఎంకే ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికీ సాక్షీభూతం. ఇక ఈ వేద నిలయం తన తదనంతరం ఎవరికి చెందాలన్న విషయాన్ని చెప్పకుండానే జయలలిత కన్నుమూసిన వేళ, దాదాపు రూ. 90 కోట్ల విలువైన ఈ ఇల్లు ఎవరికీ చెందకుండా పాడు పడనుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. వాస్తవానికి 1967లో జయలలిత, ఆమె తల్లి సంధ్య కలసి రూ. 1.32 లక్షలకు ఈ ఇంటిని కొనుగోలు చేశారు. సంధ్య కానీ, జయలలిత కానీ, వీలునామా రాయలేదు కాబట్టి, ఈ ఇంటిపై తమకు వాటా ఉందని జయలలిత మేనల్లుడు, మేనకోడలు అడిగే అవకాశాలు పుష్కలం. ఎందుకంటే, సంధ్య వారికి నాయనమ్మ కాబట్టి, ఆమె ఆస్తిలో వారికి వాటా వస్తుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే పాతికేళ్ల క్రితం కూడా వచ్చింది. జయ రాజకీయ గురువు ఎంజీ రామచంద్రన్ కు రామాపురం, చెన్నైల్లో విలాసవంతమైన భవనాలు ఉన్నప్పటికీ, వాటిపై హక్కులను ఆయన ఎవరికీ ఇవ్వక పోవడంతో, అవి వివాదాల్లో చిక్కి, ఇప్పటికీ ఎవరికీ చెందకుండా పోయాయి. ప్రస్తుతానికి శశికళ, వేద నిలయంలో ఉన్నప్పటికీ, జయ మేనకోడలు దీపా జయకుమార్, మేనల్లుడు దీపక్ లు కోర్టులో కేసు వేస్తే మాత్రం, కేసు తేలే వరకూ ఆమె ఇంటిని వదలాల్సి రావచ్చని అంచనా.

  • Loading...

More Telugu News