: ఇండోనేషియాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.8గా తీవ్రత నమోదు
ఇండోనేషియాలో ఈ తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఉత్తర సుమత్రా దీవుల్లోని ఆసె ప్రావిన్స్‌లో సంభవించిన ఈ భూకంపం తీవ్ర రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైంది. అయితే ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. ప్రాణ, ఆస్తినష్టంపైనా ఎటువంటి సమాచారం లేదు. ఇండోనేషియా స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఉత్తర సుమత్రాలోని బండా అసెకు ఆగ్నేయంగా 130 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్టు అమెరికా జియాలాజికల్ సర్వే పేర్కొంది. భూమికి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఈ భూకంపం వల్ల ఆస్ట్రేలియాకు ఎటువంటి సునామీ ముప్పులేదని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కాగా 2004లో ఇదే ప్రాంతంలో సంభవించిన సునామీ తీవ్ర నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో దాదాపు 1.70 లక్షలమంది చనిపోయినట్టు అంచనా. అదే సమయంలో భారత్‌లోనూ 8వేల మంది మృతి చెందారు.