: ఇన్ స్టాగ్రాం వెక్కిరిస్తే... ట్విట్టర్ బహుమతులు తెచ్చింది!
ఒక వ్యక్తిని ఇన్ స్టాగ్రాంలో ఒకరు తీవ్రంగా అవమానిస్తే... అతనిని ట్విట్టర్ యూజర్లు అక్కున చేర్చుకుని అంతులేని అదృష్టాన్ని పంచారు. వివరాల్లోకి వెళ్తే... బంగ్లాదేశ్ కు చెందిన నుజ్రౌల్ అబ్దుల్ కరీం సౌదీ అరేబియాలోని రియాద్ లో క్లీనర్ గా పని చేస్తున్నాడు. అతని జీతం 187 డాలర్లు (700 సౌదీ రియాళ్లు అంటే 12,675 రూపాయలు). ఇదిలా ఉంచితే, ఇటీవల కరీం ఓ బంగారం దుకాణంకు వెళ్లి, అక్కడి బంగారం నగలను ఆశగా చూస్తుండగా, ఓ వ్యక్తి ఫోటో తీశాడు. దానిని తన ఇన్ స్టాగ్రాంలో పోస్టు చేస్తూ, 'ఈ వ్యక్తి చెత్తను చూడ్డానికి మాత్రమే పనికొస్తాడు' అంటూ అవమానకరంగా వ్యాఖ్యను జోడించాడు. ఇది వైరల్ అయింది. దీంతో ఇన్సానియత్ పేరుతో ఖాతా నడుపుతున్న అబ్దుల్లా అల్ ఖహ్ తానీ 'అతనిని గుర్తించి చెప్పాలని' నెటిజన్లను కోరారు. అతనికి బహుమతులు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపారు. దీంతో పలువురు ముందుకొచ్చారు. అతనిని గుర్తించి, అతనికి బంగారం, బియ్యం బస్తాలు, తేనె, బంగ్లాదేశ్ వెళ్లి వచ్చేందుకు రానుపోను విమాన టికెట్లు, ఓ ఐఫోన్ 7, సామ్ సంగ్ గెలాక్సీ ఫోన్ బహుమతిగా ఇచ్చారు. ఆ పేద క్లీనర్‌కు 533 డాలర్లు (2 వేల సౌదీ రియాళ్లు) పంపుతానని ఒక నెటిజన్ తెలిపారు. కేవలం ఇవే కావని కరీంకు మరెన్నో బహుమానాలు పంపుతామని సోషల్ మీడియా ద్వారా సౌదీలు చెబుతున్నారు. అంతే కాకుండా గతంలో కరీను వెక్కిరిస్తూ పెట్టిన ఫోటో పక్కనే బంగారం నెక్లెస్ పట్టుకుని ఉన్న ఫోటోను మరో నెటిజన్ షేర్ చేశారు. సౌదీలు తనపై కురిపించిన ప్రేమాభిమానాలకు కరీం ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాడు.