: తమిళ రాజకీయాల్లో ఒక అధ్యాయం ముగిసింది!
తమిళ సినీ, రాజకీయాల్లో ఒక అధ్యాయం ముగిసింది. సమస్యలకు, ప్రతికూలతలకు తలవంచని ధీశాలి సైనికలాంఛనాలతో వీడ్కోలు తీసుకున్నారు. త్రివిధదళాధికారులు, గవర్నర్ విద్యాసాగరరావు సైనిక వందనం చేస్తుండగా ఫైనల్ ఫ్యునరల్ ఘనంగా నిర్వహించిన సైన్యం జయలలితకు అంతిమ వీడ్కోలు పలికింది. వేలాదిమంది తమిళ ప్రజల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రజలకు, రాష్ట్రానికి, తద్వారా దేశానికి జయలలిత చేసిన సేవలను తల్చుకుంటూ విషణ్ణవదనంతో యావత్ తమిళనాడు జయలలితకు అంతిమ వీడ్కోలు పలికింది. సైనిక లాంఛనాలు ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, గవర్నర్ సీహెచ్ విద్యాసాగరావు, తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, తంబిదురై, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య తదితరులు ఆమెకు మరోసారి నివాళులర్పించారు. అనంతరం పండితుల మంత్రోచ్చారణల మధ్య, నెచ్చెలి శశికళ, మేనల్లుడు కలిసి జయలలిత అంతిమ సంస్కారం పూర్తిచేశారు. దీంతో తమిళనాట ఒక అధ్యాయం ముగిసింది.