: జయలలిత పూర్తి సంపద వివరాలు ఇవే.. వారసులు మాత్రం ఎవరో?
అనారోగ్యంతో బాధపడుతూ నిన్న కన్నుమూసిన జయలలితకు వారసులు ఎవరూ లేకపోవడంతో ఆమె ఆస్తులు ఇప్పుడు ఎవరికి దక్కుతాయన్న ప్రశ్న అందరి మదిలోనూ మెలుగుతోంది. జయలలిత తన వారసులుగా ఎవరినీ ప్రకటించలేదు. ఇక ఆమె పలు సందర్భాల్లో ప్రకటించిన ఆస్తుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. * ఆర్ కె నగర్ నియోజకవర్గ ఉపఎన్నిక సమయంలో జయలలిత 2015 జూన్ వరకు తనకు రూ.117.13 కోట్ల ఆస్తులున్నట్టు చెప్పారు. వాటిల్లో పోయెస్ గార్డెన్ లోని జయలలితకు నివాస గృహం 'వేద విలాస్' ఉంది. 24 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం రూ.43.96 కోట్ల విలువ చేస్తుంది. ఈ గృహం ఇక శశికళ సొంతమవుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాపర్టీని జయలలిత తల్లి సంధ్య 1967లో కొనుగోలు చేశారు. ఆమె కొనుగోలు చేసిన సమయంలో ఈ గృహం విలు రూ.1.32 లక్షలు. ఇతర ఆస్తుల వివరాలు చూస్తే.. * జయలలితకు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల గ్రామంలో 14.50 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని జయలలిత 1968లో తన తల్లి సంధ్యతో కలిసి కొనుగోలు చేశారు. * తమిళనాడులోని కాంచీపురంలో 3.43 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని 1981లో కొనుగోలు చేశారు. * జయలలితకు ఉన్న నాలుగు వాణిజ్య భవనాల్లో ఒకటి హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలో ఉంది. రిపోర్టుల ప్రకారం ఈ భవనాల్లో ఒక ప్రాపర్టీని జయలలిత దత్తత తీసుకున్న శశికళ అన్న కుమారుడు వీఎన్ సుధాకర్ సొంతం కానుంది. * జయలలితకు ఉన్న వివిధ కంపెనీలకు చెందిన కార్లు మొత్తం తొమ్మిది ఉన్నాయి. వీటి ఖరీదు రూ.42,25,000 * ఇక ఆమె వద్ద ఉన్న ఆభరణాలను పరిశీలిస్తే... జయలలిత వద్ద 21280.300 గ్రాముల బరువు గల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఈ విషయాన్ని జయలలిత గతంలో ప్రకటించారు. అయితే, అక్రమాస్తుల కేసుల్లో ఈ ఆభరణాలు ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వ ట్రెజరీలో ఉన్నాయి. అంతేగాక, రూ.3,12,50,000 విలువ కలిగిన 1,250 కేజీల వెండి జయలలిత దగ్గర ఉంది. * ఆమె స్థిర, చరాస్తుల విషయానికి వస్తే.. గత ఎన్నికల సమయంలో ఆమె తెలిపిన వివరాల ప్రకారం చరాస్తులుగా రూ.41.63 కోట్లు, స్థిరాస్తులుగా రూ.72.09 కోట్లున్నాయి. * వివిధ కంపెనీల్లో ఆమె పెట్టుబడులు, షేర్లను పోలీసులు సీజ్ చేశారు. పార్టనర్ గా ఆమె ఐదు సంస్థల్లో పెట్టిన పెట్టుబడుల విలువ రూ.27.44 కోట్లుగా ఉంది. ఆమె వ్యక్తిగత రుణాలు, అడ్వాన్స్ లు ఎవరికీ, ఏ సంస్థకీ ఇవ్వలేదని ఆమె అప్పట్లో ప్రకటించారు. * ఇక 2015-16 ఏడాదికి సంబంధించిన ఆదాయపన్ను రిటర్న్ లను ఆమె దాఖలు చేశారు. 2013-14లో ట్యాక్స్ చెల్లింపులన్నీ పూర్తిచేశారు. ఆమె చివరగా ఇచ్చిన వివరాల్లో ఆమె వద్ద రూ.41,000 నగదు, రూ.2.04 కోట్ల ఆస్తిపాస్తులున్నట్టు పేర్కొన్నారు.