: జయలలితను లొట్టలేయించిన సూర్యకాంతం పులిహోర!
జయలలిత సినిమాల్లో నటించేటప్పుడు తెలుగింటి అత్త, ప్రముఖ నటి సుర్యకాంతం చేసిన పులిహోర అంటే చాలా ఇష్టమట. సినిమా షూటింగ్ లకు ఏదో ఒకటి చేసుకుని తీసుకుని రావడం, సెట్ లోని అందరికీ పెట్టడం సూర్యకాంతంకు అలవాటు. జయలలిత తెలుగు సినిమాల్లో నటించినప్పుడు కూడా ఆమె పులిహోరా తీసుకొచ్చేవారు. షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి జయలలితకు సూర్యకాంతం చేసిన పులిహోరాపైనే కళ్లన్నీ ఉండేవి. ఎప్పుడు బ్రేక్ ఇస్తారా? ఎప్పుడు పులిహోర తిందామా? అన్న ఆలోచనలో ఉండేది. అలా బ్రేక్ ఇవ్వగానే, ఆమె ఆప్యాయంగా పులిహోరా వడ్డించడం, జయలలిత ఆవురావురుమంటూ తినడంతో ఎక్కిళ్లు వచ్చేవట. దీంతో గ్లాసులో నీళ్లు తాగిస్తూ సూర్యకాంతం ప్రేమగా ఆమె తలనిమిరేవారని, అప్పుడు తనకు సూర్యకాంతంలో అమ్మ కనిపించేదని ఓ ఇంటర్వ్యూలో జయలలిత చెప్పారు. తరువాత కాలం గడిచింది. జయలలిత రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి కూడా అయ్యారు. తరువాత సూర్యకాంతం మరణించారు. కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. అదే సమయంలో ఉన్నట్టుండి ముఖ్యమంత్రిగారు వస్తున్నారంటూ కబురొచ్చింది. ఆ వెంటనే జయలలిత అక్కడికి వచ్చేశారు. నిద్రపోతున్నట్టున్న సూర్యకాంతం దేహం పక్కనే విషణ్ణవదనంతో ఆమె కూర్చున్నారు. అధికారిక కార్యక్రమాలన్నీ పక్కనపడేసి, అక్కడే ఉండిపోయారు. దీని గురించి ఓసారి మాట్లాడుతూ, తన మనసును కదిలించిన ఘటనలైనా, మనుషులనైనా మర్చిపోనని జయలలిత తెలిపారు.