: జియోకు బీఎస్ఎన్ఎల్ షాక్
ఉచిత ఆఫర్లతో ఎయిర్ టెల్, ఐడియాలాంటి టెలికాం దిగ్గజాలను వణికించిన జియోకు బీఎస్ఎన్ఎల్ షాక్ ఇచ్చింది. జియో ఆఫర్లకు చెక్ పెట్టేలా... ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల ముందుకు దూసుకొస్తోంది. ఉచిత కాల్స్, ఇతర ఫ్రీ ఆఫర్లతో సరికొత్త మంత్లీ ప్లాన్ తో వస్తోంది. నెలకు రూ. 149తో రీచార్జ్ చేసుకుంటే చాలు... ఏ నెట్ వర్క్ కైనా అన్ లిమిటెడ్ లోకల్ అండ్ నేషనల్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాదు, 300 ఎంబీ ఫ్రీడేటా కూడా అందించనుంది. ఈ ప్లాన్ జనవరి 1 నుంచి అందుబాటులోకి రానుంది. జియో రూ. 149తో 28 రోజుల వాలిడిటీతో అన్ లిమిటెడ్ కాల్స్, 300 ఎంబీ డేటా, 100 లోకల్ అండ్ నేషనల్ ఎస్ఎంఎస్ అందిస్తున్న సంగతి తెలిసింది. అయితే, మార్చ్ వరకు ఈ ఆఫర్ ను ఉచితంగా అందిస్తోంది జియో. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ మాట్లాడుతూ, తమ వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాల్స్ అందించేందుకు సన్నాహకాలు చేస్తున్నామని చెప్పారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను ఆరు రెట్ల వృద్ధితో రూ. 3,855 కోట్ల నికర లాభాలను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.