: అనుక్షణం జయలలిత మృతదేహం పక్కనే నెచ్చెలి... పవర్ చూపుతున్న శశికళా నటరాజన్!
జయలలిత పార్థివదేహం రాజాజీ హాల్ లో ప్రజల సందర్శనార్థం ఉంచిన వేళ, పార్టీలో ఆమె తరువాతి స్థానం తనదే అన్నట్టు జయలలిత దీర్ఘకాల స్నేహితురాలు శశికళా నటరాజన్, ఒక్క క్షణం కూడా ఆమెను వీడకుండా అక్కడే నిలిచారు. లక్షలాది మంది ప్రజలు, వేలాది మంది ప్రముఖులు, వందలాది మంది వీఐపీలు జయలలితకు నివాళులు అర్పించి, శశికళకు నమస్కరించి వెళుతుండగా, అతి ముఖ్యలైన కొందరు ఆమెను ఓదారుస్తున్నారు. ఆమె దేహం పక్కన ఏఐఏడీఎంకే నేతలెవరూ లేరు. జయ ఫోటోను పక్కన బెట్టుకుని గత రాత్రి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా నిలబడలేదు. సంతాప సూచకంగా ఓ నల్లని చీర ధరించిన శశికళ, జయలలిత పక్కనే ఉండి, అప్పుడప్పుడూ ఆమె ముఖాన్ని సరిచేస్తూ, పార్టీలో జయ తరువాతి స్థానం తనకు మాత్రమే సొంతమన్న సంకేతాలు స్పష్టంగా పంపారు. కాగా, గడచిన రెండున్నర నెలలుగా ఆసుపత్రిలో సైతం శశికళ హవా నడిచిన సంగతి తెలిసిందే. 1980లో ఓ వీడియో స్టోర్ యజమానిగా ఉన్న శశికళ, ఆపై జయలలితకు దగ్గరై, తన మేనల్లుడు సుధాకరన్ ను ఆమె కుమారుడిగా దత్తత చేశారు శశికళ (తర్వాత అతనిని జయలలిత దూరం పెట్టారు). అమె ఇంట్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న ఆమె, ఇంతవరకూ పార్టీలోకి మాత్రం ప్రవేశాన్ని పొందలేకపోయారు. నిన్న జయ మరణానంతరం శశికళను పార్టీ కార్యదర్శిగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఇక నేడున్న పరిస్థితి రేపుంటుందా? జయలలిత స్థాయిలో శశికళ ఎదుగుతుందా? పార్టీలో ఐక్యత ఉంటుందా? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.