: యాదృచ్ఛికమా? దైవ నిర్ణయమా? తమిళనాడుకు డిసెంబర్ శాపం!
తమిళనాడుకు డిసెంబర్ నెల శాపం ఉందా? రాష్ట్రానికి సంబంధించిన విషాద ఘటనలన్నీ డిసెంబర్ లోనే జరుగుతుండటం యాదృచ్ఛికమా? లేక దైవ నిర్ణయమా? గతంలో ఎంతో మంది ప్రజా నేతలు డిసెంబర్ లో మరణించారు. సునామీలు, భారీ వరదలు వచ్చి ఊళ్లకు ఊళ్లను తుడిచిపెట్టి వందలాది మంది మరణాలకు కారణమయ్యాయి. ఇప్పుడీ డిసెంబర్ రాష్ట్ర ప్రజలకు అత్యంత ఆప్తురాలిని దూరం చేసింది. జయలలిత రాజకీయ గురువు, మాజీ సీఎం ఎంజీ రామచంద్రన్ 1987 డిసెంబర్ 24న కన్నుమూయగా, ఆయన ప్రియ శిష్యురాలు నేడు అదే నెలలో నింగికేగడం గమనార్హం. ఇక చివరి భారత గవర్నర్ జనరల్ చక్రవర్తుల రాజగోపాలాచారి 1972 డిసెంబర్ 25న, పెరియార్ రామస్వామి అదే సంవత్సరం డిసెంబర్ 24న మరణించారు. 2004 డిసెంబర్ 26న సుమత్రా దీవుల్లో భూకంపం కారణంగా వచ్చిన సునామీ ఎలాంటి బీభత్సాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇక గత సంవత్సరం డిసెంబర్ లో చెన్నై, ఇతర ప్రాంతాలను వరద చుట్టుముట్టి ఎంతో ఆస్తి నష్టానికి కారణమైంది. ఈ వరద ప్రభావం చెన్నై ఐటీ కంపెనీలపై పెను ప్రభావాన్ని చూపగా, వేల కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది.