: హైదరాబాదుతో జయకు విడదీయలేని అనుబంధం
పురచ్చితలైవి జయలితకు మొదటి నుంచి కూడా హైదరాబాదుతో విడదీయలేని అనుబంధం ఉంది. అనేక తెలుగు సినిమాల్లో నటించిన ఆమె... హీరోయిన్ గా ఉన్నప్పుడే హైదరాబాదులోని మేడ్చల్ లో ద్రాక్ష తోటను కొనుగోలు చేశారు. ఆ ద్రాక్ష తోటకే జయగార్డెన్స్ అని పేరు పెట్టుకున్నారామె. ఆ రోజుల్లో సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్న జయలలిత... తరచుగా హైదరాబాద్ వచ్చి, జయ గార్డెన్స్ లో సేద తీరేవారు. ఆమె నటించిన 'డాక్టర్ బాబు' సినిమా మొత్తాన్ని అమీర్ పేటలో ఉన్న సారథి స్టూడియోలో నిర్మించారు. ఆ సమయంలో కూడా జయగార్డెన్స్ లోనే ఎక్కువ సమయాన్ని గడిపారామె. ఆ తర్వాత కూడా శోభన్ బాబుతో కలసి జయ నటించిన అనేక సినిమాల షూటింగ్ లు సారథి, అన్నపూర్ణా స్టూడియోల్లోనే జరిగాయి. అందుకే ఆమెకు హైదరాబాదు అన్నా, తెలుగు భాష అన్నా చాలా ఇష్టం. 2008 తర్వాత మాత్రం ఆమె ఎన్నడూ హైదరాబాదుకి రాలేదు.