: సంచలనాల కేంద్రంగా ‘అమ్మ’.. ఎంతవరకైనా వెళ్లగలిగే తెగువ జయ సొంతం!
జయలలిత.. సాహసానికి మారుపేరు. సంచలనాలకు కేంద్ర బిందువు. తెగువ ఆమె సొంతం. అభిమానిస్తే అందలెమెక్కించే జయ... ఆగ్రహిస్తే మాత్రం వెంటాడుతుంది. ఆమె ప్రతీ అడుగూ ఓ సంచలనమే. రాజకీయాల్లో ఆమెది విలక్షణ శైలి. ఆమె ఖ్యాతి ఒక్క తమిళనాడుకే పరిమితం కాలేదు. మొత్తం దేశ రాజకీయాల్లోనే ఆమెకు ఓ ప్రత్యేకత ఉంది. రాజకీయంగా ఆమె అరంగేట్రం గిట్టని ఎంతోమంది జయను రాజకీయంగా అంతమొందించేందుకు చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. అలాంటి ప్రయత్నాలు తెరపైకి వచ్చిన ప్రతిసారీ ఆమె మరింత ఉత్సాహంతో ముందుకు ఉరికారు. తన రాజకీయ గురువు, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ మరణం తర్వాత జయ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ ఎంజీఆర్ సతీమణి జానకి, జయ వర్గాలుగా చీలిపోయింది. 1989లో రెండు వర్గాలు వేర్వేరుగా పోటీచేశాయి. దీంతో పార్టీ బలహీనపడి డీఎంకే అధికారంలోకి వచ్చింది. దీంతో జానకీ రామచంద్రన్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. జానకి వర్గం జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకేలో విలీనమైంది. దాంతో 1991 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత విజయం సాధించారు. అప్పటి నుంచి జయ రాజకీయ ప్రస్థానం ఎదురు లేకుండా కొనసాగింది. విజయమే లక్ష్యంగా పార్టీని ముందుకు నడిపించారు. పలు దఫాలుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. 2016లో చివరిగా నాలుగోసారి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. పార్టీలో ఆమెకు ఎదురు చెప్పేవారు లేకుండా పోయారు. ఆమె ఆదేశాలను ఎవరైనా శిరసావహించాల్సిందే. మార్పులు, చేర్పులు ఏవైనా ఆమె చెప్పేదే వేదం. జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ మధ్య విడదీయరాని బంధం ఉంది. వారి స్నేహాన్ని అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. అంతటి స్నేహాన్ని కూడా జయ లెక్కచేయలేదు. డిసెంబరు 2011లో శశికళ, ఆమె భర్త నటరాజన్ సహా 11 మందిని జయ పోయెస్ గార్డెన్ నుంచి పంపించి వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేశారు. చివరికి తనకు జయతో స్నేహమే ముఖ్యమని, కుటుంబ సభ్యులతో సంబంధాలు వదులుకుంటున్నట్టు శశికళ ప్రకటించిన తర్వాతే జయ ఆమెను దగ్గరకు తీసుకున్నారు. జయ చివరి దశలో శశికళ ఆమెతోనే ఉన్నారు. ‘అమ్మ’ ఆస్పత్రిలో చేరిన దగ్గరి నుంచి ఆమె వెంటే ఉన్నారు.