: జయకు తెలుగంటే ఎంత అభిమానమో!
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా జయలలితకు తెలుగు భాషంటే ఎంతో ఇష్టం. తెలుగు చిత్రాలతో విడదీయలేని అనుబంధమున్న ఆమె, తెలుగుపై తన మమకారాన్ని ఎన్నో మార్లు బాహాటంగానే తెలిపారు కూడా. హోసూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గోపి, అసెంబ్లీలో తెలుగువారి సంక్షేమం గురించి మాట్లాడగా, జయలలిత తెలుగులోనే సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘అన్ని భాషలను కాపాడటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకు ఏం చెయ్యాలో మీరే చెప్పండి’ అంటూ తనదైన శైలిలో మాట్లాడారు. ఏపీలోని ఇతర భాషా విద్యార్థులు తెలుగు నేర్చుకుంటున్నారని, తమిళనాడులోని ఇతర విద్యార్థులు తమిళం నేర్చుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ఇక విలేకరుల సమావేశాల్లో తెలుగులో ప్రశ్న ఎదురైతే, తెలుగులోనే సమాధానం చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి.