: తమిళనాడు ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత (68) కన్నుమూత
తమిళనాడు ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత (68) కన్నుమూశారు. ఆమె ఈ రాత్రి 11.30 గంటలకు కన్నుమూసినట్టు అపోలో ఆసుపత్రి యాజమాన్యం తన ప్రెస్ నోట్ లో ధ్రువీకరించింది. జయలలితకు ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో ఆమెను సాధారణ వార్డు నుంచి అత్యవసర చికిత్సా విభాగం (ఐసీయూ)కు తరలించిన సంగతి తెలిసిందే. ఆమెను బతికించేందుకు వైద్యులు ఎంతో ప్రయత్నించినప్పటికీ... ఫలితం దక్కలేదు. ఒక 'ధృవ తార' తన అలుపెరుగని ప్రయాణాన్ని ముగించి, నింగికెగసింది. ఆమె తుదిశ్వాస విడిచారని వైద్యులు చివరకు అధికారికంగా ప్రకటించారు. గత సెప్టెంబర్ 22న డీహైడ్రేషన్, తీవ్ర జ్వరం వంటి అనారోగ్య కారణాలతో స్థానిక గ్రీమ్స్ రోడ్డులో ఉన్న అపోలో ఆసుపత్రిలో జయలలిత చేరారు. అప్పటి నుంచి ఆమె చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆమె ఎలాగైనా బతకాలని, తిరిగి తమ ముందుకు వచ్చి పాలించాలని కోట్లాది మంది చేసిన ప్రార్థనలు ఫలించలేదు. ఆమె మరణవార్త విని పేదల గుండెలు శోకంతో రోదించాయి. కోట్లాది ప్రజల నివాసాల్లో విషాదం అలముకుంది. తమిళనాడుతో పాటు కర్ణాటక, ఏపీలోని చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తమ హృదయ నేత జయలలిత లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. కోట్లాది పేదల ఆకలి తీర్చిన అమ్మ వెళ్లిపోతే తమకు ఇక దిక్కెవరు? అని గొంతెత్తి విలపిస్తున్నారు. రెండు నెలలకు పైగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమ్మ ఆసుపత్రి నుండి క్షేమంగా తిరిగివస్తారని ఎదురుచూసిన అభిమానులు ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. తమిళనాడులో ఎవరిని కదిలించినా ఆ మాటల నిండా విషాదమే! ఏ రాజకీయ నేతకూ దక్కనంత అభిమానాన్ని సొంతం చేసుకున్న జయలలిత రాజకీయాల్లో తనదైన బాణీని కొనసాగిస్తూ అమితంగా ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. జయలలిత తమిళనాడుకు ముఖ్యమంత్రి అయినప్పటికీ తెలుగువారికి ఎంతో సుపరిచితురాలు. ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించిన ఆమె తెలుగింటి ఆడపడుచయ్యారు. ఆమె మృతికి సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి.