: రాత్రి 11 గంటలకు జయలలితకు మరోసారి పరీక్షలు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు రాత్రి 11 గంటల సమయంలో మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించనున్నట్టు అపోలో వైద్యులు తెలిపారు. ఆమెకు చికిత్స కొనసాగుతోందని, పలు పరీక్షలు నిర్వహిస్తూ వైద్యం చేస్తున్నామని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఆమెకు నిర్వహించే పరీక్షల ద్వారా ఓ స్పష్టత రానుందని తెలుస్తోంది. మరోపక్క, అపోలో ఆసుపత్రికి భారీ ఎత్తున అన్నాడీఎంకే శ్రేణులు, ఆమె అభిమానులు చేరుకుంటున్నారు. కాగా, ఇప్పటివరకు పోలీసుల పర్యవేక్షణలో ఉన్న అపోలో ఆసుపత్రి భద్రత సీఆర్పీఎఫ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆసుపత్రికి వెళ్లే అన్ని రహదారులను సీఆర్పీఎఫ్ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆసుపత్రికి వెళ్లే అన్ని రహదారులను మూసేశారు. ప్రస్తుతానికి ఆమె గుండె స్పందించడం మొదలు పెట్టిందని, దీంతో మరింత మెరుగైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అభిమానుల కోరిక నెరవేరాలని, వారి ప్రార్థనలు ఫలించాలని పలువురు కోరుకుంటున్నారు.