: జయలలిత ఆరోగ్య పరిస్థితి రిచర్డ్ బాలే చెయ్యి దాటిపోయిందా?
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. నిన్న సాయంత్రం నుంచి ఆమె ఆరోగ్యంపై విభిన్న కథనాలు వెలువడ్డాయి. ఆసుపత్రి నుంచి హెల్త్ బులెటిన్ లు వెలువడ్డాయి. ప్రభుత్వం అన్ని ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ వైద్యుడు రిచర్డ్ బాలే ప్రకటన అందర్లోనూ ఆసక్తి నింపడంతో పాటు కీడు శంకించేలా చేస్తోంది. జయలలితకు మొదటి నుంచి నిపుణులైన వైద్యులు చికిత్సనందిస్తున్నారు. ఆ వైద్య ప్రక్రియను రిచర్డ్ బాలే పర్యవేక్షిస్తున్నారు. ఆమెకు అందుతున్న వైద్యంతో ఎయిమ్స్ వైద్యులు కూడా వెరీ గుడ్ అని ప్రశంసించి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో జయ హఠాత్తుగా కార్డియాక్ అరెస్టుకు గురయ్యారన్న సమాచారంతో చెన్నై చేరుకున్న రిచర్డ్ బాలే మాట్లాడుతూ, 8 మంది నిపుణులు ఆమె ఆరోగ్యాన్ని అనుక్షణం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఆమెకు ప్రపంచంలోని అత్యంత అధునాతన వైద్యపరికరాలతో, సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి చికిత్స చేశామని చెప్పారు. అయినప్పటికీ ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇప్పుడు మనమంతా చేయాల్సింది. దేవుడ్ని ప్రార్థించడమే అని ప్రకటించారు. దీంతో అందర్లోనూ ఆందోళన నెలకొంది. దేశవ్యాప్తంగా నిరాశ అలముకుంది. వైద్యులు అద్భుతం చేస్తారని భావించిన వారంతా కీడుశంకిస్తున్నారు.