: బ్యాంకు వద్ద తొక్కిసలాట జరిగి అస్వస్థతకు గురైన ఐదుగురు వృద్ధులు
పెద్దనోట్ల రద్దు అనంతరం దేశంలో ఏర్పడిన నగదు కొరత ఇబ్బందులు ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. బ్యాంకుల ముందు ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా బద్వేల్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచి వద్ద ఈ రోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిన్న సెలవు దినం కావడంతో ఈ రోజు ఆ బ్యాంకుకు ఖాతాదారులు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే వచ్చి క్యూ కట్టారు. మరోవైపు వృద్ధులకు పింఛన్లు కూడా బ్యాంకుల్లోనే ఇస్తున్నారు. ఈ రోజు వృద్ధులు కూడా ఆ బ్యాంకు వద్దకు భారీగా చేరుకున్నారు. ఉదయం బ్యాంకు గేట్లు తెరవగానే ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరిగి వృద్ధులు కింద పడిపోయారు. ఈ ఘటనలో ఐదుగురు వృద్ధులు అస్వస్థతకు గురయ్యారు. బ్యాంకు ముందు భారీగా ఖాతాదారులు చేరుకున్నప్పటికీ పోలీసులు సరైన బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.