: దేవుడినే వివాహం చేసుకున్న భక్తురాలు!
మధ్యప్రదేశ్ లోని టికంగడ్ జిల్లాకు చెందిన శాలిని అనే ఇరవై రెండు సంవత్సరాల యువతి తన చిన్ననాటి నుంచి శ్రీ కృష్ణుడి భక్తురాలు. రామాయణం, భగవద్గీతలోని విషయాలను వింటూ పెరిగిన ఈ వికలాంగురాలుకు శ్రీ కృష్ణుడి నామస్మరణతో తాదాత్మ్యం చెందని రోజంటూ లేదంటే అతిశయోక్తి కాదు. శ్రీకృష్ణుడిపై ఎంతగా భక్తి పెంచుకుందంటే... ఆయన్నే వివాహం చేసుకోవాలని అనుకునేంతగా! ఈ విషయాన్ని తన తండ్రి అయిన మున్నాలాల్ కి చెప్పింది. తన కూతురు ఇష్టాన్ని కాదనలేకపోయిన మున్నాలాల్ అందుకు ‘సరే’ అన్నాడు. అన్ని పెళ్లిల్లాగానే ఈ పెళ్లికి కూడా ఒక పూజారిని పిలిపించి ముహూర్తం పెట్టించాడు. నిన్న.. పంచమి తిథి రోజున ఇక్కడి శ్రీకృష్ణ ఆలయంలోని ఆయన విగ్రహంతో శాలినికి వివాహం జరిపించాడు. బంధుమిత్రులను, గ్రామస్తులని ఈ పెళ్లికి ఆహ్వానించడమే కాదు, పెళ్లికి ముందు నిర్వహించే ‘మెహెందీ’, ‘సంగీత్’ కార్యక్రమాలనూ ఘనంగా జరిపించారు. వివాహానంతరం కూడా శాలిని తమ ఇంట్లోనే ఉంటుందని, ఆమెకు ఉన్న ప్రత్యేక గదిని ఓ ఆలయంలా మార్చామని తండ్రి మున్నాలాల్ పేర్కొన్నారు.