: మోదీ కొత్త ఆలోచన... కార్డు గీకినా, డిజిటల్ చెల్లింపైనా రూ. 10 క్యాష్ బ్యాక్

నగదు రహిత భారతావనిని సృష్టించే దిశగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రతి డిజిటల్ లావాదేవీపైనా రూ. 10 క్యాష్ బ్యాక్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. జిల్లాలు, తాలూకాలు, పంచాయతీల్లో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని మరింతగా పెంచేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని భావిస్తోంది. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్కరిని డిజిటల్ విధానంలోకి చేర్చి, వారితో రోజువారీ కొనుగోళ్లలో కనీసం రెండుసార్లు డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించే అధికారులకు కూడా రూ. 10 ఇన్సెంటివ్ గా ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు నీతి ఆయోగ్ కొత్త విధానాన్ని తయారు చేసి, ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి వుంది. క్యాష్ బ్యాక్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి వుంది.