: పూలమాలలు వేసి డప్పు వాయిద్యాలతో ఏటీఎంకు హారతి పట్టిన జనం
కేంద్రప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసి 27 రోజులు గడిచినప్పటికీ బ్యాంకులు, ఏటీఎంలలో ప్రజల అవసరాలకు తగినంత డబ్బు ఉండడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులతో పాటు ఏటీఎం కేంద్రాల్లో నో క్యాష్ బోర్డులు కనిపిస్తుండడంతో వారు నిరసనలు తెలుపుతున్నారు. ఏటీఎంలలో డబ్బులు నింపిన కొద్దిసేపటికే ఖాళీ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే ఢిల్లీలోని జగత్పురా ప్రాంతంలోని ఓ ఏటీఎంలో ఖాతాదారులు వినూత్న రీతిలో తమ నిరసనను తెలిపారు. డబ్బుల కోసం ఎదురు చూసీ చూసీ విసిగిపోయిన 50 మంది ఖాతాదారులు ఏటీఎంకి పూజలు చేశారు. దానిపై పూలమాలలు వేసి డప్పు వాయిద్యాల నడుమ హారతి పట్టి తమ నిరసనను తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికే ఇలా నిరసన తెలిపామని చెప్పారు.