: ప్రత్యేక విమానాల్లో చెన్నైకి బీఎస్ఎఫ్ జవాన్లు, ఏపీ నుంచి నిలిచిన ఆర్టీసీ సేవలు
తమ రాష్ట్రానికి మరిన్ని అదనపు బలగాలను పంపాలని కేంద్రాన్ని తమిళనాడు ప్రభుత్వం కోరిన నేపథ్యంలో, అందుబాటులో ఉన్న ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లకు తోడుగా, ఈశాన్య రాష్ట్రాల్లో మోహరించి వున్న సరిహద్దు భద్రతా దళాల్లోని బెటాలియన్లను ప్రత్యేక విమానాల్లో చెన్నైకి తరలిస్తున్నారు. ఈ ఉదయం గౌహతి, కోల్ కతా విమానాశ్రయాల నుంచి బీఎస్ఎఫ్ జవాన్లు తమిళనాడులోని చెన్నై, మధురై ప్రాంతాలకు బయలుదేరారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో తమిళనాట పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, ఎలాంటి దురదృష్టకర ఘటనలు జరగకుండా మండల స్థాయి నుంచి భారీ భద్రతను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అధికారులు కదులుతున్నారు. ఇప్పటివరకూ 40 శాతం రాష్ట్రాన్ని ప్రత్యేక బలగాలు కవర్ చేశాయని తెలుస్తోంది. రేపటిలోగా తమిళనాడు రాష్ట్రం మొత్తాన్ని పోలీస్ నిఘాలోకి తీసుకోవడమే లక్ష్యమని పోలీసు వర్గాలు వెల్లడించాయి.