: ఆదివారాన్ని మింగేసిన ఏటీఎంలు.. డబ్బుల కోసం రోజంతా పడిగాపులు


ఆదివారం.. పిల్లలకైతే ఆటవిడుపు. ఉద్యోగులకైతే విశ్రాంతి దినం. వాయిదా వేసిన పనులను పూర్తిచేసుకునే రోజు. కానీ నిన్నటి ఆదివారం వాటన్నింటినీ మింగేసింది. సరదా, సంతోషం లేకుండా చేసింది. కుటుంబంతో కాసేపు గడిపే ఆనందాన్ని దూరం చేసింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. నోట్ల రద్దు తర్వాత చేతిలో చిల్లిగవ్వలేకుండా గడుపుతున్న ప్రజలు కేవలం రెండువేల రూపాయల కోసం రోజంతా ఏటీఎంల ముందు క్యూకట్టారు. పడిగాపులు కాశారు. దీంతో ఏటీఎంలన్నీ రద్దీగా మారిపోయాయి. దీనికితోడు ఏటీఎంలు తెరుచుకున్న రెండుమూడు గంటలకే మూతపడుతుండడంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇక గ్రామాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఏటీఎంలు పనిచేయక, బ్యాంకులు తెరుచుకోక, డబ్బులు తీసుకునే దారి కనిపించక గ్రామీణులు నానా ఇబ్బందులు పడ్డారు. ఆశగా ఎదురుచూసిన ఒకటో తేదీ వచ్చి వెళ్లిపోయింది. కానీ వేతన జీవులకు మాత్రం నిరాశే మిగిలింది. జీతాలు పడి నాలుగు రోజులు గడిచినా డబ్బులు తీసుకునే మార్గం లేక కష్టాలు పడుతున్నారు. నిజానికి ఏటీఎంల నుంచి రోజుకు రూ.రెండున్నర వేలు తీసుకునే వెసులుబాటు కల్పించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. చాలావరకు ఏటీఎంలలో రూ.2వేలు మాత్రమే వస్తున్నాయి. పోనీ, నేరుగా బ్యాంకుకే వెళ్లి తీసుకుందామా.. అంటే సహకరించని పనివేళలు.. వెరసి కొనసాగుతున్న కష్టాలు. ఆదివారం వచ్చింది కదా ఎలాగైనా ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకుందామనుకున్న వారికి ఆ కోరిక తీరకుండానే రోజు గడిచిపోయింది. చాంతాడులాంటి క్యూల్లో నిల్చున్నా, తమవరకు వచ్చేసరికి డబ్బులు అయిపోవడంతో నిరాశగా ఇంటికి వెనుదిరిగాల్సి వచ్చిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా ఆదివారం ఇంట్లో కుటుంబ సభ్యులతో గడపలేక, ఇటు డబ్బులూ తీసుకోలేక ఏటీఎంల వద్దే గడిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News