: నేడు నితిన్ గడ్కరీ కుమార్తె వివాహం... నాగపూర్ లో ప్రముఖుల సందడి
కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కుమార్తె కేతకి వివాహం, శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫేస్ బుక్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆదిత్య కస్కేద్కర్ తో నేడు నాగపూర్ లో వైభవంగా జరగనుండగా, ఈ వివాహానికి రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు వీఐపీలు హాజరు కానున్నారు. సంప్రదాయ మహారాష్ట్ర విధానంలో వివాహం జరుగనుండగా, భాజపా చీఫ్ అమిత్ షా, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, ప్రకాశ్ జవదేకర్, పియూష్ గోయెల్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, చత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే తదితరులు పెళ్లికి హాజరుకానున్నారు. కాగా, ఈ వివాహానికి రాలేమంటూ, మహారాష్ట్ర గవర్నర్ సి విద్యాసాగర్ రావు, అసోం గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ లు గడ్కరీకి సమాచారం ఇచ్చారు. తాము 8న ఢిల్లీలో జరిగే రిసెప్షన్ కు వచ్చి వధూవరులను ఆశీర్వదిస్తామని వారు తెలిపినట్టు గడ్కరీ సన్నిహితులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలు వివాహానికి హాజరు కావడం లేదని, వీరు కూడా ఢిల్లీలో రిసెప్షన్ కు మాత్రం వెళతారని సమాచారం.