: అసలే అత్యవసర ల్యాండింగ్... ఆపై పేలిన జెట్ లైట్ టైర్... శంషాబాద్ లో అధికారుల ఆందోళన!
అది కోల్ కతా నుంచి బెంగళూరు వెళుతున్న జెట్ లైట్ విమానం. కోల్ కతాలో బయలుదేరిన తరువాత, విమానం హైడ్రాలిక్ వ్యవస్థలో సాంకేతక లోపం ఏర్పడినట్టు పైలట్ గుర్తించాడు. అప్పటికే విమానం సగం దూరానికి పైగా ప్రయాణించింది. విషయాన్ని శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏటీసీ అధికారులకు సమాచారం ఇవ్వగా, ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతి లభించింది. అపై మొత్తం 134 మంది ప్రయాణికులతో కూడిన విమానం ల్యాండ్ కాగా, విమానం టైర్లు రన్ వేను తాకగానే పేలాయి. విమానాన్ని జాగ్రత్తగా గమనిస్తున్న అధికారులు, వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి, రన్ వేను 20 నిమిషాలకు పైగా బ్లాక్ చేశారు. విమానం ఆగిన తరువాత ప్రయాణికులను దింపి, దాన్ని పక్కకు నెట్టారు. నిన్న రాత్రి 8:30 గంటలకు ఈ ఘటన జరుగగా, 9:30 తరువాత విమానాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. టైర్ పేలిన విమానం ఎక్కడ అగ్ని ప్రమాదానికి గురవుతుందోనని ఆందోళన చెందినట్టు ఎయిర్ పోర్టు అధికారి ఒకరు తెలిపారు.