: బ్యాంకులకు కొత్త కరెన్సీ రాదు... మనం సర్దుకుపోవాల్సిందే: తెలంగాణ కొత్త సీఎస్ ప్రదీప్ చంద్ర
బ్యాంకులకు మరిన్ని కొత్త నోట్లు వచ్చే అవకాశాలు లేవని, ప్రజలు నగదు రహిత లావాదేవీలకు అలవాటు కావాల్సిందేనని తెలంగాణ చీఫ్ సెక్రటరీగా గతవారం బాధ్యతలు స్వీకరించిన ప్రదీప్ చంద్ర వ్యాఖ్యానించారు. గతంలో చలామణిలో ఉన్న నోట్లతో పోలిస్తే 20 నుంచి 30 శాతం కరెన్సీతోనే సర్దుకుపోవాల్సి వుందని, సాంకేతికతను అందిపుచ్చుకుని డిజిటల్ లావాదేవీలు అలవాటు చేసుకుంటే ఇబ్బందులు ఉండవని అన్నారు. సెక్రటేరియట్ ఉద్యోగులకు నగదు రహిత లావాదేవీలపై నిర్వహించిన క్యాంపులో ఆయన పాల్గొన్నారు. కరెన్సీ రద్దు తరువాత ప్రభుత్వం డిజిటల్ దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. చిరు వ్యాపారులు, గ్రామీణ ప్రాంతాల్లో రైతుల కోసం ఇంకొంత నగదు వస్తుందని వెల్లడించిన ఆయన, కేంద్ర నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. డిజిటల్ అక్షరాస్యతను ఒకరు నేర్చుకున్న తరువాత, మరొకరికి చెప్పాలని అన్నారు. రైతుల ఖాతాల్లో మార్కెట్ల నుంచి ఆన్ లైన్ విధానంలో నిధులు జమ చేసే రోజులు రానున్నాయని తెలిపారు.