: పాక్‌ను ఢీకొట్టేందుకు సిద్ద‌మైన భార‌త్ అమ్మాయిలు.. ఆసియాక‌ప్ ఫైన‌ల్ నేడే


మ‌రికొన్ని గంటల్లో ఉత్కంఠ పోరుకు తెర‌లేవ‌నుంది. చిర‌కాల ప్ర‌త్య‌ర్థుల పోరుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. బ్యాంకాక్‌లో జ‌రుగుతున్న‌ ఆసియాకప్ టీ20 టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్న భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఇప్ప‌టికే ప‌ది పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్న హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని మ‌హిళా జ‌ట్టు లాంఛ‌నం పూర్తి చేసి క‌ప్‌ను ఎగ‌రేసుకుపోవాల‌ని ఉవ్విళ్లూరుతోంది. లీగ్ ద‌శ‌లో పాక్‌ను చిత్తు చేసిన భార‌త్ మ‌రోమారు అదే ఆట‌తీరుతో పాక్‌ను ఇంటికి పంపాల‌ని భావిస్తోంది. మ‌రోవైపు లీగ్‌ద‌శ‌లో ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని పాక్ ర‌గిలిపోతోంది. దీంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో భార‌త జ‌ట్టు బ‌లంగా ఉండ‌డం క‌లిసొచ్చే అంశం. బౌలింగ్‌నే న‌మ్ముకున్న పాక్ పూర్తి సామ‌ర్థ్యంతో బ‌రిలోగి దిగుతోంది. దీంతో నేటి ఫైన‌ల్ చివ‌రికంటా ఉత్కంఠ‌గా కొన‌సాగే అవ‌కాశం ఉంది. ఉద‌యం 11:30 గంట‌ల నుంచి స్టార్‌1లో మ్యాచ్ ప్ర‌త‌క్ష ప్ర‌సారం కానుంది.

  • Loading...

More Telugu News