: నేడు తేలనున్న ఇటలీ ప్రధాని భవితవ్యం.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రపంచ దేశాలు
మొన్న బ్రెగ్జిట్ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తే, నిన్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపాయి. నేడు ఇటలీలో జరగనున్న రెఫరెండం ప్రపంచ దేశాలనే కాదు.. ప్రపంచ మార్కెట్లను సైతం ఊపేస్తోంది. రాజ్యాంగంలో చేపట్టబోయే చట్ట సంస్కరణలు సహేతుకమా? కాదా? అన్న అంశంపై నేడు ఇటలీ ప్రజలు తమ అభిప్రాయమేంటో చెప్పనున్నారు. అసలు ఎందుకీ రెఫరెండం అంటే..? కొద్దిగా వెనక్కి వెళ్లాలి. గత రెండు దశాబ్దాలుగా ఇటలీ అన్ని రంగాల్లోనూ బాగా వెనకబడిపోయింది. ఇటలీ రాజకీయాల్లో అనిశ్చితిని తొలగించి పార్లమెంటులో ఎగువ సభ బలాన్ని 315 నుంచి 100 తగ్గించాలనేది ప్రధాని మాటియో రెంజీ ఆలోచన. నిజంగా ఆయన అనుకున్నట్టు జరిగితే అధికారాలు కూడా తగ్గుతాయి. కాబట్టి రెఫరెండం వల్ల ఇటలీకి స్థిరత్వం వస్తుందనేది ఆయన భావన. ఒకవేళ తాను రెఫరెండంలో ఓడిపోతే పదవికి రాజీనామా చేస్తానని రెంజీ ముందే ప్రకటించడంతో రెఫరెండంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. రెంజీ కనుక ఓడిపోయి పదవికి రాజీనామా చేస్తే అధ్యక్షుడు సెర్గియో మాటెరెల్లా ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చే అవకాశం ఉంది. ఇది ఆ దేశంలో అస్థిరతకు కారణమవుతుంది. యూరోపియన్ యూనియన్ నుంచి ఇటలీ బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతం పూర్తి ఒడిదుడుకుల్లో ఉన్న ఇటలీ ఆర్థిక వ్యవస్థకు ఇది అంత క్షేమకరం కాదు. మరోవైపు రెఫరెండం వార్తతో స్టాక్ మార్కెట్లు సగానికి సగం పతనమై ఆందోళనను మరింత పెంచాయి. మరికొన్ని గంటల్లో అంటే భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 11:30 గంటలకు రెఫరెండానికి సంబంధించి ఓటింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 3:30 గంటలకు ముగుస్తుంది. రేపు(సోమవారం) ఫలితాలు వెల్లడవుతాయి. రెంజీ ఆలోచన ఫలించి సంస్కరణలకు అనుకూలంగా కనుక తీర్పు వస్తే అంతర్జాతీయ మార్కెట్లకు ఊరట లభిస్తుంది. లేదంటే స్టాక్‌మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలే ప్రమాదం ఉంది. ఇది ఈయూతోపాటు ప్రపంచ మార్కెట్లపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఆ ప్రభావం భారత స్టాక్ మార్కెట్ల పైనా పడే అవకాశం ఉందని చెబుతున్నారు.