: లండన్‌లోనూ నోట్ల గోల.. ఆ నోటుకు వ్యతిరేకంగా విస్తృత ప్రచారం
నోట్ల గోల మన దేశాన్నే కాదు.. లండన్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే అక్కడి పరిస్థితి వేరు. అక్కడ కొత్తగా ప్రవేశపెట్టిన 5 పౌండ్ల నోటులో జంతువుల కొవ్వును ఉపయోగించడాన్ని అక్కడి హిందువులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఆ నోటును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బ్రిటన్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఇటీవల కొత్తగా 5 పౌండ్ల కరెన్సీ పాలిమర్‌ను చలామణిలోకి తెచ్చింది. ఇందులో జంతుకొవ్వును ఉపయోగించారని ఆరోపిస్తూ హిందూ ఫోరం ఆఫ్ బ్రిటన్ (హెచ్ఎఫ్బీ) ఆందోళనకు దిగింది. నోటును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ చేపట్టింది. బ్రిటన్‌లోని లక్షలాదిమంది శాకాహారులు ఈ నోటును వ్యతిరేకిస్తూ ఒక్కటయ్యారు. బ్యాంకు నోట్ల నుంచి కొవ్వును తొలగించాలంటూ ప్రచారం చేపట్టారు. ఇందుకు సంబంధించిన పిటిషన్‌పై ఇప్పటి వరకు 1.2 లక్షల మంది సంతకం చేశారు. మరో 30 వేల మంది సంతకం చేయగానే ఆ పిటిషన్‌ను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌కు అందజేయనున్నారు. ఐదు పౌండ్ల నోటుపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ పునరాలోచనలో పడింది. ప్రజల మనోభావాలను గౌరవిస్తామని, వారి ఫిర్యాదును పరిశీలిస్తామని పేర్కొంది.