: డైలాగ్ కావాలా... అలా అరవటం ఆపకపోతే ఇరగ్గొడతాను: వర్మ
డైరెక్టర్ అవ్వకముందు నుంచీ 'వంగవీటి' సినిమా తీయాలని అనుకున్నానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపాడు. విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించిన 'వంగవీటి' సినిమా ఆడియో వేడుకలో వర్మ మాట్లాడుతూ, ఇంజనీరింగ్ చేయడానికి కాలేజీకి వచ్చాను కానీ, నేర్చుకున్నది మాత్రం ఇక్కడి వాతావరణాన్ని అని అన్నారు. తన జీవిత, సినీ అనుభవం మొత్తం విజయవాడ నుంచే ప్రారంభమైందని ఆయన చెప్పారు. అప్పట్లో చోటుచేసుకున్న చాలా సంఘటనలు ఈ సినిమాలో ఉంటాయని ఆయన తెలిపారు. అప్పట్లో తాను కూడా ఒక గ్యాంగ్ లో ఉన్నానని ఆయన వెల్లడించారు. 'వంగవీటి' అనేది తన కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ గా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఈ సబ్జెక్ట్ తో తనకున్న ఎమోషనల్ బాండింగ్ మరే సినిమాకి లేదని ఆయన తెలిపారు. సినిమా ఎలా వచ్చిందన్నది సినిమా రిలీజైన తరువాత అంతా చూస్తారని ఆయన తెలిపారు. ఈ సినిమాలో కేవలం తన అనుభవాలు మాత్రమే కాదని, స్టోరీలో పట్టు ఉండడం కూడా తానీ సినిమా తీసేందుకు కారణమైందని అన్నారు. ఇంతలో వేదిక ముందు అభిమానులు 'డైలాగ్ డైలాగ్' అంటూ అరవడంతో... డైలాగ్ కావాలా? అని 'అరవడం ఆపకపోతే ఇరగ్గొడతాను' అన్నారు. దీంతో అంతా నవ్వేశారు. అనంతరం తన ప్రసంగం కొనసాగిస్తూ... ఈ కథ పట్ల ఒక్కొక్కరి అవగాహన ఒక్కోలా ఉంటుందని, తనకున్న అవగాహనతోనే తానీ సినిమా తీశానని ఆయన చెప్పారు. వివాదాస్పద అంశాలతో రూపొందే సినిమా అని తెలిసినా, ఏమాత్రం బ్యాలెన్స్ చేయకపోయినా ప్రమాదం ఉందని తెలిసినా నిర్మాత దాసరి కిరణ్ వెనకడుగు వేయకపోవడం విశేషం అని ఆయన కితాబునిచ్చారు. దాసరి కిరణ్ కేవలం డబ్బులు పెట్టడంతోనే తన పనైపోయిందని భావించకుండా, చాలా కష్టపడి పనిచేశాడని ఆయన అభినందించారు. కేఎల్ యూనివర్సిటీ సత్యనారాయణగారు ఈ స్థలం ఇవ్వడం విశేషమని, ఆయనకు ధన్యవాదాలు అని చెప్పారు.