: ఏ కథనైనా సినిమాగా తీసుకునే సర్వహక్కులూ డైరెక్టర్లకి ఉన్నాయి!: దేవినేని నెహ్రూ
విజయవాడలో దేవినేని నెహ్రూతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు మధ్యాహ్నం భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివాదాస్పదమైన వంగవీటి సినిమా గురించి దేవినేని నెహ్రూ మాట్లాడారు. గతంలోనూ తమ ఇంటికి వస్తానని వర్మ అన్నప్పుడు స్వాగతించానని, ఇప్పడు కూడా అదేపని చేశానని అన్నారు. సినిమాలో ఓ పాటను బ్యాన్ చేయడం మంచిదని గతంలో రామ్‌గోపాల్ వర్మ తనను కలిసినప్పుడు చెప్పానని గుర్తు చేశారు. డైరెక్టర్లకి ఏ కథనైనా సినిమాగా తీసుకునే సర్వహక్కులు ఉన్నాయని ఆ రోజే చెప్పానని అన్నారు. రాంగోపాల్ వర్మ సినిమా ట్రైలర్స్ మాత్రం పెన్‌డ్రైవ్‌లో పెట్టి చూపించాడని దేవినేని నెహ్రూ అన్నారు. మిగతా సినిమా గురించి తనకు అంతగా తెలియదని చెప్పారు. వర్మకు కావాల్సింది బిజినెసేనని, ఆయన వృత్తి అదేనని వ్యాఖ్యానించారు. నిజజీవితాలను దృష్టిలో పెట్టుకొని ఆయన సినిమాలు తీసుకుంటాడని అన్నారు. సమాజంలోని వ్యక్తులు ఎలాంటి వారో ప్రజలకి తెలుసని, సినిమాల్లో ఎలా చూపించినా అంతప్రభావం ఉండబోదని అన్నారు. ఒకరికున్న మనస్తత్వం మరొకరికి ఉండదని అన్నారు. ఒకటిన్నర నిమిషాల సినిమా ట్రైలర్‌ను మాత్రమే వర్మ తనకు చూపించాడని అన్నారు.