: వంగవీటి నా డ్రీమ్ ప్రాజెక్ట్... సినిమా తీసుకునే హక్కు నాకు ఉంది!: రామ్ గోపాల్ వర్మ
దేవినేని నెహ్రూతో భేటీ అయిన రామ్ గోపాల్ వర్మ ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు తరువాత చెబుతానని అన్నారు. తాను సినిమా ట్రైలర్ ను మాత్రమే దేవినేని నెహ్రూకి చూపించానని, ప్రత్యేకంగా ఇతరుల పాత్రల వివరాలను నెహ్రూకి చెప్పలేదని తెలిపారు. ప్రస్తుతం వివాదాలు కమ్ముకున్నప్పటికీ, తాను తీసిన సినిమాలో మార్పులు మాత్రం ఏమీ చేయబోనని వర్మ తెగేసి చెప్పారు. సినిమా తీసుకునే హక్కు తనకు ఉందని, ఆ ప్రకారమే ముందుకు వెళతానని అన్నారు. వంగవీటి రాధాకృష్ణ, రత్నకుమారిల నుంచి ఎటువంటి అబ్జెక్షన్ వచ్చిందన్న దాని గురించి తరువాత చెబుతానని తెలిపారు. వారితో చర్చించిన అంశాల్లో కొన్ని సమస్యలొచ్చాయని మాత్రమే వర్మ చెప్పారు. అందరూ ఒకేలా ఆలోచించరని, తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉంటారని అన్నారు. ఇద్దరు మనుషులకి మధ్య తలెత్తే విభేదాలు అప్పటి పరిస్థితులను బట్టి ఉంటాయి. వాటిని ఇప్పుడు సినిమాలో చూపించినంత మాత్రాన ఆ విభేదాలు మళ్లీ బయటకి రావని అన్నారు. వ్యక్తిగతంగా ఒకరిని టార్గెట్ చేస్తూ తాను సినిమా తీయలేదని చెప్పారు. నెహ్రూకి ఆడియో టైలర్స్ మత్రమే చూపించానని, రాధా, రత్నకుమారిల గురించి ఇప్పుడు చెప్పదలుచుకోవట్లేదని అన్నారు. తాను ఎవరి అభ్యంతరాలనూ పరిగణలోకి తీసుకోనని స్పష్టం చేశాడు.