: నవ్వుతూనే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు... నేనైతే తగ్గే ప్రసక్తే లేదు: రామ్ గోపాల్ వర్మ
తాను ఇప్పటి వరకు ఎన్నో సీరియస్ వార్నింగ్ లను చూశానని... కానీ తొలిసారి నవ్వుతూ ఇచ్చిన సీరియస్ వార్నింగ్ ను చూశానని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపాడు. ఈ రోజు విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ, రత్నకుమారిలతో వర్మ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం తర్వాత మీడియాతో ఏమీ మాట్లాడని వర్మ... ఆ తర్వాత ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఇప్పుడు రాధాను, అతని తల్లిని కలిశానని... మీటింగ్ ఆశించిన స్థాయిలో జరగలేదని వర్మ చెప్పాడు. సినిమాకు సంబంధించి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయని... అయినా తాను ఏమాత్రం తగ్గనని... ఏం జరుగుతుందో చూద్దామని తెలిపాడు. 'డేంజరస్ సిచ్యువేషన్... కానీ, 'వంగవీటి' సినిమాకు సంబంధించి నా ఆలోచనల విషయంలో ఎంతమాత్రం కాంప్రమైజ్ కాను' అని వర్మ చెప్పాడు. ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఇబ్బంది పెడుతున్నారని... కానీ, రాధారంగా మిత్రమండలికి చెందిన కొంతమంది తనను సపోర్ట్ చేస్తున్నారని... 'వంగవీటి' ఆడియో ఫంక్షన్ కు వారిని ఆహ్వానించామని చెప్పారు.