: సరిహద్దులో మరోసారి పాకిస్థాన్ ఉగ్రవాదుల కాల్పులు.. పౌరుడు మృతి
పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ లక్షిత దాడులు చేసినప్పటికీ బుద్ధితెచ్చుకోని ఉగ్రవాదులు సరిహద్దు ప్రాంతాల్లో సైనికులు, పౌరులపై కాల్పులకు తెగబడుతూ దుస్సాహసానికి దిగుతున్నారు. జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లా పాక్ సరిహద్దు ప్రాంతంలో పాక్ తీవ్రవాదులు ఈ రోజు ఉదయం మరోసారి కాల్పులకు తెగబడ్డారు. భారత ఆర్మీ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఎదురు కాల్పులకు దిగింది. అయితే ఆ ప్రాంతం గుండా వెళుతున్న అసదుల్లా కుమార్ అనే పౌరుడు ఈ కాల్పుల కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. కశ్మీర్ మత్స్య శాఖలో అసదుల్లా ఓ ఉద్యోగి. నిన్న కూడా ఉగ్రవాదులు, భారత సైన్యానికి మధ్య ఇలాగే జరిగిన కాల్పుల్లో అనంత్‌నాగ్ జిల్లాలో ఓ కాంగ్రెస్ కార్యకర్త మృతి చెందాడు.