: తైవాన్ అధ్యక్షురాలికి ఫోన్ చేసి.. చైనాను రెచ్చగొట్టిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తమ దేశ విదేశీ విధానానికి విభిన్నంగా ప్రవర్తించారు. అధికార బాధ్యతలు స్వీకరించక ముందే ట్రంప్ తైవాన్ దేశాధ్యక్షురాలితో ఫోన్‌లో మాట్లాడారు. 1979లో రూపొందించిన అమెరికా విధానాన్ని ఉల్లంఘిస్తూ ట్రంప్ ఈ విధంగా ప్రవర్తించి చైనాను రెచ్చగొట్టారు. 1979 తరువాత తైపీ (తైవాన్ రాజధాని)లో అమెరికా తన రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇరు దేశాల మధ్య అధికారిక చర్చలు కానీ, ఎలాంటి ఒప్పందాలు కానీ జరగలేదు. అమెరికా, తైవాన్‌ల మధ్య భద్రతా సంబంధాలను మెరుగు పరుచుకునే అంశంపై ట్రంప్ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో తైవాన్ తమ భూభాగ ప్రాంతమని విర్రవీగిపోయే చైనా ట్రంప్ చర్య పట్ల కంగుతింది. తైవాన్ దేశాధ్యక్షురాలిగా సాయ్ ఇంగ్ వెన్ ఈ ఏడాదే ఎన్నికయ్యారు. ఫోన్‌లో మాట్లాడిన సందర్భంగా ట్రంప్ ఆమెకు శుభాకాంక్షలు కూడా చెప్పారు. ట్రంప్ చర్య పట్ల చైనా స్పందిస్తూ... అమెరికా, తైవాన్‌ల మధ్య అధికారిక సంబంధాలను, మిలటరీ ఒప్పందాలను తాము ఖండిస్తున్నామని తేల్చి చెప్పింది. దీనిపై అమెరికా వివరణ ఇవ్వాలని చైనా పేర్కొంది. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు తైవాన్ ప్రెసిడెంట్ తనకు ఫోన్ చేసి అభినందించారని, అందుకు ఆమెకు కృతజ్ఞతలని ట్రంప్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.