: భవిష్యత్తులో నగదురహిత లావాదేవీలే ఉంటాయి.. ఈ మార్పునకు అందరూ సహకరించాలి: చంద్రబాబు
పెద్దనోట్ల రద్దు తరువాత రాష్ట్రంలో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించాలని అధికారులకు సూచించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు వారితో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ఆ పనుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన నగదు నిర్వహణ ఫీజును రద్దు చేసిన బ్యాంకర్లకు అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజల కోసం శ్రమిస్తోన్న బ్యాంకు సిబ్బంది, అధికారులు మంచి ఫలితాలు సాధిస్తారని అన్నారు. భవిష్యత్తులో నగదురహిత లావాదేవీలే ఉంటాయని, ఈ మార్పునకు అందరూ సహకరించాలని, వాటికి ప్రజలందరూ అలవాటుపడాలని అన్నారు. గ్రామాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియకు పారిశ్రామికవేత్తలు సహకరించాలని చంద్రబాబు నాయుడు కోరారు. మరోవైపు ఇప్పటికే 5 జిల్లాల్లోని రేషన్ షాపుల్లో నగదు రహిత లావాదేవీలు మొదలుపెట్టినట్లు పేర్కొన్నారు. మొబైల్ లావాదేవీల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను పెంచాలని ఆయన అధికారులకు సూచించారు.