: తెలుగు సాహితీ యుగకర్త పుట్టిన రోజు నేడు


'పదండి ముందుకు' అంటూ అభ్యుదయ కవితాక్షరాలను తన కలం పాళీ నుంచి సంధించి తెలుగు సాహిత్యాన్ని వందేళ్ళు ముందుకు తీసుకెళ్ళిన యుగకర్త, కవితా స్రష్ట శ్రీశ్రీ జన్మదినం నేడు. మహారచయిత చలం చెప్పినట్టు.. 'ఉన్న ఒక్క కవి కృష్ణశాస్త్రి ఉన్నత హిమాలయ శిఖరాల్లో కురిసిన కవితా వర్షం, దేశాల వెంట ప్రవహించి, చివరికి సైడు కాలువల్లో పలుకుతున్న సమయాన, తన భీషణాతప జ్వాలలతో ఆవిరిపొగలు లేపి ఆకాశమార్గాన విహరింపజేసి రక్షించినవాడు శ్రీశ్రీ. ఇంతకంటే శ్రీరంగం శ్రీనివాసరావు గురించి ఎక్కువగా చెప్పే సాహసం చేయడమంటే, ఆకాశమంత ఎత్తున్న ఆయన వీపును అభినందన పూర్వకంగా తట్టే ప్రయత్నం చేయడమే.

తనకీ, ప్రపంచానికి సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర్, బహిర్ యుద్ధారావమే కవిత్వం అయితే.. శ్రీశ్రీ సాహిత్యం ఈ పరిమితులను మించిన ఏ అంతరాళానికో చెందుతుంది. అందుకే, 'శ్రీశ్రీకి ముందు శ్రీశ్రీకి వెనుక' అని సాహితీ కాలాన్ని తూచడం మనం చూస్తుంటాం. ఓ మహావృక్షం నీడలో మరో చెట్టు నీడ కనిపించదు కదా. అలాగే, రాయవలసిందంతా శ్రీశ్రీ ఎప్పుడో రాసేశాడు. భావ కవిత్వం తన ఉనికిని చాటుకునేందుకు నానా అగచాట్లు పడుతున్న సమయాన శ్రీశ్రీ ఓ ప్రభంజనం మల్లే వ్యాపించాడు.

'ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి!' అని శ్రీశ్రీ అనడం ఆలస్యం, ఆయన్ను అనుసరిస్తూ ఓ తరం బయల్దేరింది. అభ్యుదయం మా ధ్యేయం... అంటూ మరో ప్రస్థానం సాగించింది. 'అగ్గిపుల్లా, సబ్బుబిళ్ళా, కుక్క పిల్లా కాదేదీ కవితకనర్హం' అని ప్రవచిస్తే.. సృష్టిలో ప్రతి వస్తువూ, ఓ కవితా వస్తువైంది. కార్మికులు, కర్షకులు.. అవిశ్రాంత శ్రామికులు ఎక్కడివారైనా విపరీత ఆవేశంతో మహాప్రస్థానంలో శ్రీశ్రీని ఆవహించారు. ఇది యుగకర్తకి ఒకవైపే!

రెండోవైపు చూస్తే, 'కలకానిది విలువైనది'.. అంటూ తత్వగీతం రచించడం, 'పాడవేల రాధికా' అంటూ ప్రణయ సుధలు ఒలికించడం శ్రీశ్రీ కలం ఒడుపును తెలియజేస్తుంది. ఇక 'మనుసున మనసై..' అంటూ రెండు హృదయాల నడుమ అద్భుతమైన భావ ప్రసారాన్ని నడిపిస్తాడు. తన పాతశైలిలో ప్రబోధాత్మకరీతిలో 'తెలుగువీర లేవరా..' అంటూ గుండెల్లో దాగిన దేశభక్తిని తట్టి లేపుతాడు. 'ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా...' అంటూ హెచ్చరిస్తాడు. 'వాడిన పూలే వికసించెనే' అని ఆయన కలం నుంచి అక్షరాలు జాలవారడం తరువాయి.. అందంగా స్వరాలమాలలో ఒదిగిపోతాయి. అందుకే ఆయన్ని అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి.

జాతీయసినీ పురస్కారం, నంది అవార్డులు, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, సాహిత్య అకాడెమీ అవార్డు అన్నీ శ్రీశ్రీని వరించి తమను తాము గౌరవించుకున్నాయి. అంతటి ఘనతర సాహిత్యాన్ని మనకందించిన శ్రీశ్రీ మహాశయుడిని ఆయన జన్మదినం సందర్భంగా మరోసారి మనసారా స్మరించుకుందాం. ఆయన తన రచనల ద్వారా అందించిన స్ఫూర్తిని మన తర్వాతి తరాల వారికి అందించేందుకు మనవంతు కృషి చేద్దాం.

  • Loading...

More Telugu News