: డబ్బుకోసం క్యూలైన్లో నిలబడి... పండంటి బిడ్డకు జన్మనిచ్చింది
డబ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వచ్చి... పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఓ మహిళ. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో జరిగింది. జింజాక్ గ్రామానికి చెందిన సర్వేషా (30) అనే మహిళ డబ్బు కోసం నిన్న ఉదయాన్నే బ్యాంకుకు వచ్చి, క్యూ లైన్లో నిలుచుంది. ఇంతలో ఆమెకు నొప్పులు వచ్చాయి. దీంతో, ఆమె అత్త కొందరు మహిళల సహాయంతో ఆమెను బ్యాంకులో ఉన్న ఓ గదిలోకి తీసుకెళ్లింది. ఆ గదిలోనే సర్వేషా ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను ఎత్తుకుని సర్వేషా అత్త ఎంతో మురిసిపోయింది. తన కోడలు కొంత బలహీనంగా ఉన్నప్పటికీ... మనవరాలు మాత్రం చాలా ఆరోగ్యంగా ఉందని సంతోషంగా తెలిపింది. అనంతరం తల్లీబిడ్డలను పోలీసు వ్యానులో ఆసుపత్రికి తరలించారు. కాగా, సర్వేషా భర్త ఆశ్వేంద్ర ఆమధ్య రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దాంతో ఆమెకు ఎక్స్ గ్రేషియాగా వచ్చిన సొమ్ము నుంచి తొలి వాయిదా 2.75 లక్షల మొత్తాన్ని డ్రా చేసుకోవడానికి తను నిండు చూలాలు అయినప్పటికీ ఆమె బ్యాంకుకు వచ్చింది.