: బాప్‌రే! ఎంత పెద్ద జరిమానానో!.. జియో ప్రకటనల్లో మోదీ ఫొటో వాడుకున్నందుకు జస్ట్ రూ.500 ఫైన్!
రిలయన్స్ జియో ప్రకటనల్లో అనుమతి లేకుండా ప్రధాని నరేంద్రమోదీ ఫొటో వాడుకున్నందుకు రిలయన్స్‌కు విధించనున్న జరిమానా ఎంతో తెలుసా? అక్షరాలా ఐదువందల రూపాయలు. వివిధ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు, దినపత్రికలకు జియో ఇచ్చిన ప్రకటనల్లో ప్రధాని ఫొటో ఉండడంపై తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ప్రధాని ఫొటోపై రాజ్యసభలో ప్రతిపక్షాలు నిలదీశాయి. ప్రధాని ఫొటో వాడుకున్నందుకు అనుమతి మంజూరు చేశారా? అంటూ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నీరజ్ శేఖర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో సమాచార మంత్రిత్వశాఖ సహాయ మంత్రి రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో జియో ప్రకటనల్లో ప్రధాని మోదీ ఫొటో వాడుకునేందుకు కేంద్రం ఎటువంటి అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. మరి అనుమతి లేకుండా ఫొటో వాడుకున్నందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారన్న ప్రశ్నకు 1950 చట్టం ప్రకారం నిబంధనలు అతిక్రమించినందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ చట్టం ప్రకారం రిలయన్స్ కు కేవలం రూ.500 జరిమానా విధించనున్నారు. కాగా తాజా దుమారంపై రిలయన్స్ ఇప్పటి వరకు స్పందించలేదు.