: ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వినూత్న ఆఫర్.. ప్రతి రూపాయికి నిమిషం ఉచిత టాక్ టైమ్
సేవింగ్స్ ఖాతాలను పెంచుకునేందుకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వినూత్న ఆఫర్‌తో ముందుకొచ్చింది. వినియోగదారులు డిపాజిట్ చేసే ప్రతి రూపాయికి ఎయిర్‌టెల్ నుంచి ఎయిర్‌టెల్‌కు నిమిషం టాక్‌టైమ్ ను ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది. అయితే ఇది తొలిసారి డిపాజిట్లు చేసిన వారికి మాత్రమేనని తెలిపింది. అంటే వినియోగదారుడు వెయ్యి రూపాయలతో ఖాతా తెరిస్తే వెయ్యి ఉచిత నిమిషాలను పొందవచ్చన్నమాట. దేశవ్యాప్తంగా ఉన్న ఏ ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌కు అయినా ఈ ఉచిత నిమిషాలతో మాట్లాడుకోవచ్చని వివరించింది. గత నెల 23న రాజస్థాన్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించిన ఎయిర్‌టెల్ బ్యాంకు ఒక్క రాజస్థాన్‌లోనే ఈ నెలాఖరు నాటికి లక్షమందికిపైగా వినియోగదారులును ఇందులో చేర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎయిర్‌టెల్ కస్టమర్ బ్యాంకు నుంచి చేసే డిజిటల్ లావాదేవీలకు ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని పేమెంట్స్ బ్యాంకు సీఈవో శశి అరోరా తెలిపారు.