: మీ క్రెడిట్, డెబిట్ కార్డులు ఆరు సెకన్లలో గుల్లయిపోతాయి జాగ్రత్త!
మీరు క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? అయితే ఒక్క క్షణం. ఇకముందు ఆన్‌లైన్‌లో వస్తువులు కొనేముందు కొన్ని జాగ్రత్తలు పాటించండి. లేదంటే ఆరంటే ఆరు సెకన్లలో మీ కార్డులోని సమస్త సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించే ప్రమాదం ఉంది. ఈమాటన్నది మరెవరో కాదు.. బ్రిటన్‌లోని న్యూకేజిల్ యూనివర్సిటీ పరిశోధకులు. డెబిట్, క్రెడిట్ కార్డుల వాడకంలోని లోపాలపై అధ్యయనం చేసిన వారు ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా మోసానికి గురయ్యే మార్గాలను బయటపెట్టారు. తప్పుడు సమాచారంతో హ్యాకర్లు చేసే పలు ప్రయత్నాలను వీసా వ్యవస్థ కానీ, బ్యాంకులు కానీ పసిగట్టలేకపోతున్నాయని పరిశోధనకారులు పేర్కొన్నారు. దీంతో స్వయంచాలిత సమాచారంతో కార్డుల్లోని సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని తెలిపారు. వెబ్‌సైట్లలో పలుమార్లు ప్రయత్నించడం ద్వారా కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోగలుగుతున్నారని, కేవలం ఆరు సెకన్లలోనే కావాల్సిన సమాచారంపై ఓ అంచనాకు వచ్చేస్తున్నారని వారు వివరించారు. చిన్న ల్యాప్‌టాప్, దానికో నెట్ కనెక్షన్ ఉంటే చాలు హ్యాకర్లు వీసా భద్రతా వ్యవస్థలోకి చొరవడి కార్డుల సమాచారాన్ని తస్కరించ గలుగుతున్నారని వారు పేర్కొన్నారు. ఒకే కార్డుతో తప్పుడు సమాచారంతో పలుమార్లు ఆన్‌లైన్ కొనుగోళ్లు జరుపుతున్నప్పటికీ దానిని బ్యాంకులు గుర్తించలేకపోతున్నాయని తెలిపారు. పిన్ నంబర్, గడువుతేదీ, కార్డు నంబరు తదితర వివరాలను తెలుసుకునేందుకు హ్యాకర్లు చేసే ప్రయత్నాలను బ్యాంకింగ్ వ్యవస్థ గుర్తించలేకపోతోందన్నారు. ఒక్కో వెబ్‌సైట్ ఒక్కో రకంగా సమాచారాన్ని తెలుసుకుని నిర్ధారించడం కూడా హ్యాకర్లకు అనుకూలంగా మారుతోందన్నారు.