: ఈ సరికొత్త బ్యాటరీ 5 వేల ఏళ్లు నిరంతరాయంగా పని చేస్తుందట!
ఒక బ్యాటరీ సుమారు 5 వేల ఏళ్లు నిరంతరాయంగా పనిచేయగలిగితే? శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎవరూ ఊహించని అద్భుతాలు చోటుచేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టాల్స్ ఇంటర్ ఫేస్ యనాలసిస్ సెంటర్ కు చెందిన ప్రొఫెసర్ టామ్ స్కాట్ బృందం సరికొత్త బ్యాటరీని తయారు చేసింది. అణుధార్మిక వ్యర్థ పదార్థాలను ఉపయోగించి అత్యంత సుదీర్ఘకాలం పనిచేసే సామర్థ్యం కలిగిన ‘వజ్రపు బ్యాటరీ’ని రూపొందించారు. ఈ బ్యాటరీని 2016లో తయారు చేస్తే అది నిరంతరాయంగా 7746 (సుమారు 5 వేల ఏళ్ల) వరకు పనిచేస్తుందని ఆయన చెబుతున్నారు. ఈ బ్యాటరీలను డ్రోన్లు, శాటిలైట్లు, అంతరిక్ష నౌకల్లో ఉపయోగించవచ్చని ఆయన చెప్పారు. అంతే కాకుండా అణుధార్మిక వ్యర్థాలు, బ్యాటరీ జీవిత కాలానికి సంబంధించిన వివిధ సమస్యలకు ఇది చెక్ చెబుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రేడియేషన్ కోసం రేడియో యాక్టివ్ ఐసోటోప్ నికెల్-63ను ఉపయోగించి నమూనా ‘వజ్రపు బ్యాటరీ’ని తయారు చేసినట్టు ఆయన తెలిపారు. దీనిని మరింత అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నామని ఆయన తెలిపారు. ఈ బ్యాటరీని తయారు చేసేందుకు కార్బన్-14ను పరిశోధకులు ఉపయోగిస్తున్నారని, ఇది కొంత మొత్తంలో రేడియేషన్ ను విడుదల చేస్తుందని ఆయన తెలిపారు. అయితే ఇలా విడుదలయ్యే రేడియేషన్ ను ఇతర ఘనపదార్థాలు సులభంగా గ్రహిస్తాయని ఆయన చెప్పారు. అందరికీ తెలిసినట్టే అత్యంత దృఢ పదార్థం వజ్రమని ఆయన గుర్తు చేశారు. ఈ కృత్రిమ వజ్రాన్ని రేడియో యాక్టివ్ పదార్థాలకు అతి సమీపంలో ఉంచినప్పుడు, ఆ రేడియో యాక్టివ్ పదార్థం ఆ వజ్రపు పొరల్లో నిక్షిప్తమవుతుందని ఆయన తెలిపారు. వజ్రంలో రేడియేషన్ ను నిక్షిప్తం చేయడం ద్వారా సురక్షితమయన, సుదీర్ఘకాలం పాటు పని చేసే సామర్థ్యం కలిగిన బ్యాటరీలను తయారు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ బ్యాటరీలో విద్యుత్తు 5,730 ఏళ్లకు 50 శాతం, 11 వేల ఏళ్లకు 25 శాతం తగ్గుతుందని ఆయన తెలిపారు.