: దేశాన్ని కుదిపేస్తున్న మోదీ సొంత రాష్ట్రంలో ఓ వ్యాపారి చేసిన ప్రకటన!
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో ఓ వ్యాపారి చేసిన ప్రకటన దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. అహ్మదాబాద్ కు చెందిన మహేష్ షా అనే వ్యాపారి తన వద్ద 13 వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉందని, ఇది కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన స్వచ్ఛంద ఆదాయ పథకం (ఐడీఎస్) కింద తెల్లడబ్బుగా మార్చుకుంటానని సెప్టెంబర్ 30న ఆదాయపు పన్ను శాఖాధికారులకు తెలిపాడు. ఈ మొత్తం డబ్బుకి తొలి విడతగా నవంబర్ 30లోపు 975 కోట్ల ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. అయితే దానిని చెల్లించడంలో ఆయన విఫలమయ్యారు. దీంతో ఆదాయపు పన్ను శాఖాధికారులకు చేతినిండా పని కల్పించారు. ఇంత మొత్తం ఆయన వద్దకు ఎలా వచ్చింది? ఇది అసలు అతనిదేనా? లేక అతను ఎవరికైనా బినామీనా? అతను బినామీ అయితే ఈ సొమ్ము ఎవరిది? అన్న వివరాలు ఆరాతీయడంలో ఆదాయపుపన్ను శాఖ బిజీగా మారిపోయింది. దీంతో ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఆయన అకౌంటెంట్ కార్యాలయం, అతడి బంధువుల ఇళ్లలో సోదాలకు దిగారు. ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. కాగా, ఆయనపై సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ఆసక్తికరంగా స్పందించడం విశేషం.