: అసలు నువ్వు పోటీలోనే లేవు...విమర్శిస్తే ఎలా?: మ్యాక్స్ వెల్ ను ప్రశ్నించిన లీమన్
క్రికెట్ ఆస్ట్రేలియాపై ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ సంధించిన ఆరోపణలకు కోచ్ డారెన్ లీమన్ సమాధానం చెప్పాడు. చాలా కాలంగా ఫాంలో లేని ఆటగాడు స్థానం దక్కలేదన్న అక్కసుతో చేసిన ఆరోపణలని స్పష్టం చేశాడు. మ్యాక్స్ వెల్ 2014 నుంచి షిఫెల్డ్ షీల్డ్ టోర్నీలో ఆడిన తొమ్మిది మ్యాచ్ లలో ఒక్క సెంచరీ కూడా చేయలేదని ఆయన గుర్తు చేశారు. ఫామ్ లో లేని ఆటగాడ్ని జాతీయ జట్టులోకి ఎలా ఎంపిక చేస్తామని ఆయన ప్రశ్నించారు. దీనిపై మ్యాక్స్ వెల్ బాహటంగా విమర్శలు కురిపించడం తమను నిరుత్సాహపరచిందని ఆయన తెలిపారు. ఆత్మవిశ్వాసాన్ని నింపుకుని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో స్థానం పొందాల్సిన మ్యాక్స్ వెల్... తనను కాదని వేరే క్రికెటర్ని ఎంపిక చేశారంటూ విమర్శలు చేయడం తగదని ఆయన హితవు పలికారు.