: రాజకీయ, సినీ రంగాల ప్రముఖులని వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచిన తెలుగుతేజం పీవీ సింధు
ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు దేశంలోని బడా బడా నేతలు, సెలబ్రిటీలందరి కన్నా ముందుకు దూసుకుపోయింది. ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన అనంతరం సింధు పాప్యులారిటీ ఎన్నో రెట్లు పెరిగిపోయినట్లు ఈ సర్వే ద్వారా తెలుస్తోంది. ప్రముఖ సెర్చింజన్ యాహూ ఈ ఏడాది ఇండియాలో అత్యధికంగా వార్తల్లో నిలిచిన వ్యక్తులపై సర్వే నిర్వహించింది. ఇందుకోసం దేశంలోని పలు రంగాల్లోని ప్రముఖ వ్యక్తులను పరిశీలించింది. ఈ సర్వేలో రాజీకీయ, సినీ రంగ ప్రముఖులందరి కన్నా అత్యధికంగా మన సింధు వార్తల్లో నిలిచి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. కాగా, రియోలో జిమ్నాస్టిక్స్ విభాగంలో తృటిలో పతకం కోల్పోయిన దీప కర్మాకర్ ఈ సర్వేలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. రెజ్లర్లు సాక్షి మాలిక్, విఘ్నేశ్ పొగట్‌లు కూడా ఈ ఏడాది అధికంగానే వార్తల్లో నిలిచారని యాహూ పేర్కొంది. క్రికెటర్లకు అత్యధిక సంఖ్యలో అభిమానులు ఉన్న భారత్‌లో క్రికెట్ నుంచి కాకుండా వేరే క్రీడల్లోని క్రీడాకారులు ఈ సర్వేలో ముందు వరసలో నిలవడం విశేషమే. ఇక క్రికెటర్లలో ముగ్గురు టాప్ టెన్‌లో నిలిచారు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, వన్డే కెప్టెన్ ఎమ్‌ఎస్ ధోనీ, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీలకు టాప్ టెన్‌లో చోటు లభించింది. ఇతర రంగాలను వదిలిపెట్టి రాజకీయ రంగాన్ని పరిశీలిస్తే సోషల్‌మీడియాలో అత్యధికంగా శోధించిన వ్యక్తిగా ప్రధాని మోదీ, ఆ తరువాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. ఇక సామాజిక మాధ్యమాల్లో అత్యధికంగా టైప్ చేసిన పదం ‘రియో ఒలింపిక్స్’ మొదటి స్థానంలోను, ‘ఐపీఎల్-2016’ రెండో స్థానంలోను నిలిచాయి. కాగా, ఎప్పటిలాగే అత్యధికంగా శోధించిన మహిళా సెలెబ్రిటీగా సన్నీలియోన్ నిలిచింది.