: చిన్న నోట్లు రావాలంటే చాలా సమయం పడుతుంది: ముఖ్యమంత్రి చంద్రబాబు

కేంద్రప్రభుత్వం నల్లధన నిరోధానికి పెద్దనోట్లను రద్దు చేసిందని, గత నెల 8న ఈ నిర్ణయం తీసుకుందని ఈ రోజుకి 25వ రోజు కావస్తుందని, అయినా ఇబ్బందులు ఇంకా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు అనంతపురంలోని గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... ప్రజలకి అవసరమైనన్ని డబ్బులు సర్క్యులేషన్‌లో లేవని అన్నారు. పెద్దనోట్లను రద్దు చేయడంతో చిల్లర ఇబ్బందులు వచ్చాయని అన్నారు. 2000 రూపాయల నోటును తీసుకొచ్చినా అది అవసరం లేకుండా ఉండిపోయిందని అన్నారు. చిల్లర కష్టాలు తప్పడం లేవని అన్నారు. చిన్న నోట్లు రావాలంటే చాలా సమయం పడుతుందని అన్నారు. నోట్ల రద్దు తరువాత ప్రభుత్వం 800 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిందని, ఈ ఇబ్బందులు ఓ పక్క ఉంటే మరో వైపు చిరు వ్యాపారులు, రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు అన్నారు. వేరే రాష్ట్రాల కంటే డిజిటలైజేషన్‌లో ముందుండాలని తమ ప్రభుత్వం ఎప్పటినుంచో కృషి చేస్తోందని చెప్పారు. డిజిటల్ లావాదేవీలు జరగాలని ఎప్పటినుంచో చెబుతున్నామని అన్నారు. ప్రజలకు నగదు ఇబ్బందులు లేకుండా చేయాలనుకుంటున్నానని అన్నారు. కష్టాలు తీరాలంటే మొబైల్ లావాదేవీలు పెరగాలని చెప్పారు. పెద్ద ఎత్తున నగదురహిత లావాదేవీలు చేసి దేశానికే కాకుండా ప్రపంచానికే ఆదర్శంగా నిలుద్దామని పిలుపునిచ్చారు.