: నాన్నగారి కలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు నిజం చేశారు: బాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అనంతపురం జిల్లాలో పర్యటించి పెనుకొండ మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తన నాన్నగారి కలను చంద్రబాబు నాయుడు ఈ రోజు నిజం చేశారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆనాడు ఈ పనులు ప్రారంభిస్తామని చెప్పినప్పుడు ఇది జరిగేపని కాదని పలువురు విమర్శలు చేశారని అన్నారు. ఒక మంచి సంకల్పంతో చలనచిత్రాల్లోనే కాకుండా రాజకీయాల్లో రాణించి రాయలసీమ ప్రజల అవస్థలు తెలుసుకున్న ఎన్టీఆర్ అనంతపురం జిల్లాలో నీటి సౌకర్యంపై ఎంతో దూరదృష్టితో ఆలోచించారని బాలయ్య చెప్పారు. ఈ రోజు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీటి విడుదల చంద్రబాబు చేతుల మీదుగా చేయడం తనకు ఆనందంగా ఉందని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోకుండా ప్రజాసంక్షేమమే ధ్యేయంగా రాయలసీమలో పలు పనులను ప్రారంభించారని చెప్పారు. రాయలసీమకు నీరు అందితే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని బాలయ్య పేర్కొన్నారు. అక్కడి ప్రజలు కోరుకునేది ముఖ్యంగా నీరేనని అన్నారు. నీరందితే అందరూ సంతోషంగా ఉండగలుగుతారనే ఆనాడు ఎన్టీఆర్ భావించారని చెప్పారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం చంద్రబాబుకే సాధ్యమైందని చెప్పారు. హిందూపురం నుంచి తాను ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.