: సీరియల్స్ పిచ్చి పట్టుకుంది.. మహిళలు వారి భర్తకు కాఫీ కూడా ఇవ్వడం లేదు: గోవా మంత్రి
ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న గోవా సాంస్కృతిక శాఖ మంత్రి దయానంద్ మంద్రేకర్ మహిళలపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, విమర్శలు ఎదుర్కుంటున్నారు. నేటి మహిళలపై టీవీల్లో వచ్చే సీరియల్స్ ప్రభావం బలంగా ఉందని, ఉదయం నుంచి కష్టపడి ఇంటికి వచ్చిన భర్తకు కప్పు కాఫీ కూడా ఇవ్వడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. వారు సీరియల్స్ చూసేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారని, ఇక సాయంత్రం సమయంలో వారు టీవీ ముందు కూర్చొని వాటిని చూడటం మొదలు పెట్టారంటే భర్తలను కూడా పట్టించుకోవడం లేదని అన్నారు. ఓ వైపు టీవీల్లో ఎన్నో మంచి మంచి ప్రోగ్రాములు ప్రసారం అవుతున్నప్పటికీ మహిళలు మాత్రం సీరియల్స్ మాత్రమే చూస్తూ అవే లోకంగా బతుకుతున్నారని దయానంద్ మంద్రేకర్ అన్నారు. మహిళలు ఒక్కరోజు సీరియల్స్ చూడకపోయినా తాము ఆ రోజులో ఏదో కోల్పోయినట్లు భావిస్తున్నారని చెప్పారు. మహిళలు గ్రామాల్లో నిర్వహించే ఎన్నో కార్యక్రమాలకు, సంప్రదాయ పండుగలకు హాజరుకాకుండా ఇటువంటి పనులు చేస్తున్నారని ఆయన అన్నారు. సదరు మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని అన్నారు. బీజేపీ నేతలు మహిళల పట్ల ఎటువంటి ధోరణితో ఉన్నారో ఆయన వ్యాఖ్యల ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. వారికి మహిళలను అవమానపర్చడం ఇది కొత్తేమీ కాదని విమర్శిస్తున్నారు.